రైతుల ఆత్మహత్యలు అగేదెలా?

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా బలవన్మరణాలు ఆగలేవు. రాష్ట్రం రాక ముందు అవి విద్యార్థులవైతే, రాష్ట్రం వచ్చాక రైతు సోదరులవి. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం గానీ, పౌర సమాజం గానీ ఆశించిన విధంగా స్పందిoచలేదు. తెలంగాణ మీడియా ప్రభుత్వానికి కర పత్రికలుగా, గొంతుకగా మారి పోయాయే తప్ప, జనగోసని వినిపించడంలో ఘోరంగా విఫలం అయ్యాయి. ప్రజా ప్రతినిధులు నవ తెలంగాణ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలకు గత ప్రభుత్వాలని విమర్శించడానికే తమ విలువైన సమయాలను కేటాయిస్తున్నారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతతో మెసులుకోవాల్సింది పోయి ప్రతీ విషయాన్ని ఒక సమస్యగా మార్చుకొని పరస్పరం బురద చల్లుకొనే కార్యక్రమంలో మునిగిపోయారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల బతుకుల్లో చీకట్లు కమ్ముకుంటే, మన కేం పట్టనట్లు కోట్లు కుమ్మరించుకొని బతుకమ్మ సంబరాలు చేసుకొన్నాము.
ఒక వైద్యునిగా సమాజం పట్ల నా బాధ్యతగా నాకు తట్టిన కొన్ని నివారణోపాయాలు:
1. తక్షణం ఒక హాట్ లైన్ నంబర్ ఏర్పాటు చెయ్యడం. ముఖ్య ఉద్దేశ్యం: ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉన్న ఈ రోజులలో, ఈ నంబర్ కి విస్తృత ప్రచారం కల్పించి ఆత్మహత్యకు పూనుకుంటున్న రైతు సోదరునికి తన గోస చివరిసారిగానైనా వినిపించుకునే అవకాశం కల్పించడం. బాధ పంచుకుంటే కొంతైనా స్వాంతన లభిస్తుంది. ఆ వ్యక్తిని ఆత్మహత్యకు పురి కొలుపుతున్న పరిస్థితులు ప్రభుత్వానికి తెలుస్తాయి.
2. తక్షణం ఆ గ్రామ పంచాయితి లేదా జిల్లా అధికార కేంద్రం ద్వారా ఆత్మహత్య నివారణ చర్యలు చేప్పట్టడానికి ఒక ర్యాపిడ్ యాక్షన్ టీం ని సిద్ధం చెయ్యడం. ఎమర్జన్సీ మెడికల్ కిట్ తో బాటు, ఒక వైద్యుడు, నర్స్, మానసిక కౌన్సిలర్ అ టీం లో ఉండడం, ప్రస్తుత 108 సర్వీసులకు వీటిని అనుసంధించడం, కావాల్సిన చోట ప్రైవేట్ నర్సింగ్ హోం ల సహాయం తీసుకోవడం మొదలైనవి.
3. గ్రామ గ్రామాన ఉన్నట్టువంటి లయన్సు క్లబ్ లాంటి వివిధ ఎన్. జి. ఓ. ల ద్వారా స్వాంతన గ్రూపులను ఏర్పాటు చెయ్యడం.
4. గ్రామీణ స్థాయి మెడికల్ మరియు పారా మెడికల్ సిబ్బందికి ఆత్మహత్యలను చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులకు ఇవ్వవలిసిన మానసిక కౌన్సిలింగ్ పద్దతులలో తగిన శిక్షణ ఇప్పించడం.
5. హుధుద్ తూపాన్ పునరావాసానికి పౌరసమాజాన్ని విరాళాలకొరకు ప్రేరేపించినట్లు, రైతులను ఆదుకునే దిశగా యావత్తు తెలుగు సమాజాన్ని మేలుకొలుపాలి. (కష్టాలకు ప్రాంతీయ భేదాలు లేవు. తుపాన్ వచ్చినప్పుడు ఎందరో తెలంగాణ తెలుగు ప్రజలు ఉదారంగా విరాళాలు ఇవ్వడం నేను ఎరుగుదును. తెలంగాణలో ఉంటున్న ఎందరో ఉదారులైన సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు మన రైతాంగాన్ని ఆదుకొనే నిమిత్తం ముందుకు రాకపోరు.)
6. రుణ మాఫీ, రిషెడ్యూలింగ్ ఎలాగు మన ప్రభుత్వం చేస్తుంది, కానీ ఆ విషయాన్ని జనంలోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్ళాలి.
తెలంగాణ సిద్ధించింది. మన చిరకాల కల నెరవేరింది. ఇక ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఇంతకు ముందటి పరిస్థితికి తీసుకుపోలేదు. మరి మనలో ఎందుకు ఇంతటి అభత్రతా భావం? ప్రభుత్వానికి ఉంటే ఉండొచ్చు అది వాళ్ళ రాజకీయం. మనలో ఎవరు కాస్త క్రియాశీలంగా, నిర్మాణాత్మకంగా విమర్శించినా వారిని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఇరు ప్రాంతాల విజ్ఞులు, మేధావులు ఇకనైనా ఈ పరస్పర విధ్వంసానికి తెరదింపి ఒక నిర్మాణాత్మక భూమికను పోషించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రాంతాలు రాష్ట్రాలు వేరైనా తెలుగు వారు ఒకరి కొకరు తోడ్పడుకుంటూ దేశంలో అగ్రగాములుగా పురోగమించాలని ఆశిస్తున్నాను.
రైతు కన్నీరు ఏ గడ్డకయినా శ్రేయస్కరం కాదు. అన్నదాత క్షేమమే మన అందరికి శుభదాయకం.